మద్యం పాలసీ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవితలకు భారీ ఊరట లభించినట్లయింది. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన రౌస్ ఎవెన్యూ కోర్టు నిందితులందరిపైనా నమోదైన కేసులను కొట్టివేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు సహా అభియోగాలు మోపిన 23 మందికి ఈ కేసు నుండి రిలీఫ్ ఇస్తున్నట్లు తెలిపింది. వారిపై ఉన్న అభియోగాలను నిరూపించడంలో సీబీఐ విఫలమైందని వ్యాఖ్యానించింది.
ఇక కేసుకు సంబంధించి క్లీన్ చిట్ ఇవ్వడంతో మాజీ ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. ‘కడిగిన ముత్యం వలే బయటకు వస్తానని ఆనాడే చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. న్యాయవ్యవస్థపై నేను పెట్టుకున్న నమ్మకం నిలబడింది. రాజకీయ కక్షతో కేసు పెట్టారని చెప్పిందే నిజమైంది. ఈ కేసు వల్ల నేను, నా కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించాం. కష్ట సమయంలో అండగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలని కవిత అన్నారు. ఇక ఆమె సోషల్ మీడియాలో ‘సత్యమేవజయతే’ అని పోస్ట్ చేశారు.