పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా గబ్బర్ సింగ్ వంటి సినిమాతో పవన్ ఫ్యాన్స్ కు బంపర్ విజయాన్ని అందించిన హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, పోస్టర్లు ఈ అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లగా..తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ హ్యాట్ ధరించి స్టైలిష్ గా కనిపిస్తున్న పోస్టర్, సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.రిలీజ్ చేసిన వెంటనే పోస్టర్ వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రియులు పవన్ కళ్యాణ్ లుక్ కి ఫిదా అవుతున్నారు. మళ్లీ గబ్బర్ సింగ్ రోజులకు తీసుకెళ్తున్నారని తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేంజ్ రెస్పాన్స్ తో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ప్రభంజనం సృష్టిస్తున్నారు. ప్రారంభం నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు అదిరే రెస్పాన్స్ లభిస్తోంది. ‘దేఖ్ లేంగే సాలా’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటలు చార్ట్బస్టర్లుగా నిలిచాయి. పవన్ కళ్యాణ్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, త్వరలోనే చిత్రానికి సంబంధించిన పవర్‌ప్యాక్డ్ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ గ్లింప్స్ అభిమానులకు అసలు సిసలైన మాస్ విందుని అందించనుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.