అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. వార్ ప్రారంభమైన తొలి రోజే ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఆయన ఆఫీసుపై దాడులు చేయడంతో ఖమేనీ సహా 40 మంది అత్యున్నత సైనికాధికారులు మృతి చెందారు. ఖమేనీ మృతిని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా అధికారికంగా వెల్లడించింది. ఇరాన్ తీవ్రంగా ప్రతీకార దాడులు చేసింది. దీంతో యుద్ధం మరింత పెరిగింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్, డ్రోన్లతో విరుచుకుపడింది. ఎయిర్ పోర్టులు, దుబాయ్ లోని పలు బిల్డింగ్స్ కు నష్టం వాటిల్లింది. ఇక గాయపడిన వారిలో భారతీయులూ ఉన్నారు. పశ్చిమాసియాలో వందల ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. భారత్ నుండి దాదాపు 220 ఫ్లైట్స్ నిలిచిపోయాయి. దీంతో వేల మంది ఎయిర్ పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. అమెరికా వార్ షిప్ పై మిస్సైల్స్ పేల్చామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. మరోవైపు ఖమేనీ వారసుడి ఎన్నిక ఒకట్రెండు రోజుల్లో జరగనుంది. ఇరాన్ సైనిక బలగాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబోల్రహీం మౌసావి, డిఫెన్స్ మినిష్టర్ అజీజ్ నసీర్జాదే, సెక్యూరిటీ అలీ శంఖానీ తదితరులు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారిలో ఉన్నారు. ఇరాన్ పై నిన్న కూడా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. 9 ఇరాన్ ఆయిల్ షిప్స్ ను ముంచేశామని, నేవీ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఖమేనీ కార్యాలయంపై భారీగా బాంబు దాడులు జరిగిన దృశ్యాలు శాటిలైట్ ఇమేజెస్ లో కనిపించాయి. ఈ దాడుల్లోనే 86 ఏళ్ల ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ నిన్న ప్రకటించింది. ఆయనతో పాటు కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన వ్యక్తి మరణించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఖమేనీతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ అత్యున్నతాధికారి, ఖమేనీ భద్రతా సలహాదారు మేజర్ జనరల్ మహమ్మద్ పాకాపౌర్ మరణించారు. ఖమేనీ మరణంతో టెహ్రాన్‌లో కొంద భవనాల పైకి వచ్చి సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు వేల మంది నిరసనలు చేశారు. ఖమేనీపై దాడుల వివరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.