మన ప్రజా రాజధాని అమరావతిని ఒక ఆధునిక న్యాయ నగరం (Justice City) గా తీర్చిదిద్దుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. న్యాయస్థానాలు, జుడిషియల్ అకాడమీలు, మధ్యవర్తిత్వ కేంద్రాలు, న్యాయ సేవా సంస్థలు మరియు న్యాయమూర్తుల నివాస సముదాయాలు అన్నీ ఒకే చోట ఉండేలా ఒక సమగ్ర వ్యవస్థను ఇక్కడ నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ దిశగా ఒక కీలక అడుగు పడింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ జుడిషియల్ అకాడమీ మరియు హైకోర్టు గెస్ట్ హౌస్ కు శంకుస్థాపన చేశారు. మరియు హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలను ప్రారంభించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం, అమరావతిలో న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల బలోపేతంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలో, న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖులందరూ ఈరోజు అమరావతిలో సమావేశమవ్వడం ఒక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.