మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. కొద్ది కాలంగా నిలకడగా ఉన్న చమురు ధరలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయికి చేరుకోవడం ఆర్థిక నిపుణులను కలవరపెడుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగితే, దాని ప్రభావం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేదు. ముఖ్యంగా మధ్యప్రాచ్యం , ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో నెలకొన్న తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తతలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు, ఇరాన్ వంటి చమురు ఉత్పత్తి దేశాల ప్రమేయం వల్ల సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. సముద్ర మార్గాల ద్వారా జరిగే రవాణాకు ఆటంకం కలగడంతో, చమురు సరఫరా తగ్గుతుందనే భయంతో కంపెనీలు ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. సాధారణంగా ముడిచమురు ధరలు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా సమాంతరంగా పెరుగుతుంటాయి. డీజిల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు భారం అవుతాయి. ఫలితంగా కూరగాయల నుండి నిత్యావసర వస్తువుల వరకు అన్నింటి ధరలు ఆకాశం వైపు చూస్తాయి. మనదేశం తన అవసరాలకు అవసరమైన చమురులో దాదాపు 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. కాబట్టి, అంతర్జాతీయ మార్కెట్లో చిన్న మార్పు వచ్చినా అది భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం 85 శాతానికి పైగా ముడి చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ధరలు ఒక్క డాలర్ పెరిగినా, మన దేశ ఖజానాపై వేల కోట్ల భారం పడుతుంది. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు , ఉత్పత్తి తగ్గింపు వంటి కారణాల వల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం సహజం. గ్లోబల్ మార్కెట్లో ధర పెరిగితే ఆ ప్రభావం సామాన్యుడిపై పడుతుంది. ఇక ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం తక్కువని ప్రభుత్వ వర్గాలు , ఇంధన రంగ నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా రష్యా నుంచి భారత్ తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తోంది. ఇదే ప్రస్తుతానికి మనకు అతిపెద్ద ఊరట.అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం పెరగకుండా ప్రభుత్వం చమురు సంస్థలను ధరలు పెంచకుండా అదుపు చేస్తోంది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్య నిల్వలను చాకచక్యంగా వినియోగిస్తోంది. గతంలో ధరలు తక్కువగా ఉన్నప్పుడు OMCs భారీ లాభాలను ఆర్జించాయి. ఇప్పుడు ఆ లాభాలను వినియోగదారులకు బదిలీ చేస్తూ ధరలను స్థిరంగా ఉంచగలుగుతున్నాయి.భౌగోళిక రాజకీయాలను చూస్తే పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ, సప్లై చైన్‌లో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంలో విజయం సాధించింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 2022 ఏప్రిల్ నుంచి దాదాపు స్థిరంగానే ఉన్నాయి.