ఆంధ్రప్రదేశ్ ను ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా అభివృద్ధి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. నేడు గనుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ‘ఆంధ్రప్రదేశ్ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ ’ రూపకల్పన, ఇన్వెస్ట్మెంట్స్, తదితర అంశాలపై చర్చించారు. రేర్ మినరల్స్ విషయంలో కేంద్రం, మిగిలిన రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, వాల్యూ ఎడిషన్ పైనా మరింత అధ్యయనం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని తీరప్రాంతంలో లభించే బీచ్ సాండ్ మినరల్స్ దేశంలోనే అత్యంత విలువైనవని, వీటిలో ప్రధానంగా ఇల్మెనైట్, రుటైల్, జిర్కాన్, మోనాజైట్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి ఖనిజాలు ఉన్నాయని, పెయింట్స్, కాస్మెటిక్స్, ఔషధ పరిశ్రమ, ఏరోస్పేస్, రక్షణ రంగం, శస్త్రచికిత్స, సెరామిక్స్, ఎలక్ట్రానిక్స్, అణు ఇంధనం, అణు రియాక్టర్ భాగాల వంటి కీలక పరిశ్రమలకు ఇవి అవసరం అవుతాయని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో లభిస్తున్న మినరల్స్‌ను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు మూడు ముఖ్యమైన ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందులో సంవత్సరానికి 15 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా శ్రీకాకుళంలో టైటానియం పార్క్. సంవత్సరానికి 25,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా అనకాపల్లిలో రేర్ ఎర్త్ కారిడార్, మచిలీపట్నంలో సమగ్ర టైటానియం, రేర్ ఎర్త్ కారిడార్ ఉన్నాయి. ఈ సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, మైనింగ్, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.