మిడిల్ ఈస్ట్ లో ఒకవైపు పరిస్థితులు ఎలాంటి ఉద్రిక్తకరంగా ఉన్నాయో చూస్తున్నాం. మరోవైపు పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ మధ్య బోర్డర్ టెన్షన్స్ కూడా ఉద్రిక్తకరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ పై ఇటీవల జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ ను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు. సరిహద్దుల్లో జరిగే హింస వలన సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇంటర్నేషనల్ హ్యుమానిటీ, ఇంటర్నేషనల్ చట్టాలను బాధ్యతాయుతంగా పాటించాలని పౌరుల రక్షణకు చర్యలు చేపట్టాలనే సెక్రటరీ జనరల్ పిలుపునకు మద్దతుప్రకటించారు. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్ భూభాగంపై ఇటీవల జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ ను భారత్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇవి అంతర్జాతీయ చట్టాలతో పాటు ఆ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. ఇక, రెండు దేశాలు సంయమనం పాటించాలని ఇప్పటికే పలు దేశాలు పిలుపునిచ్చినా ఘర్షణలు కొనసాగుతున్నాయి.