ప్రభుత్వ శాఖలు ఇకనుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ను మాత్రమే కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత రవాణా వ్యవస్థ లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు. కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే వెహికల్స్ సైతం ఈవీలే ఉండాలని పేర్కొన్నారు. రవాణా శాఖలోని మాన్యువల్ విధానాలకు స్వస్తి చెప్పాలని, మొత్తం ఆన్లైన్లోనే కార్యకలాపాలు కొనసాగించాలని ఆదేశించారు.సీఎం రేవంత్, రవాణా శాఖ మంత్రి పొన్నం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆర్టీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని, వెంటనే సొంత భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. రహదారి ప్రమాదాలపై అవగాహన పెంచాలని, ప్రజల్లో చైతన్యం కోసం షార్ట్ ఫిల్మ్‌లు ప్రదర్శించాలని సూచించారు. శంషాబాద్ సమీపంలో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభమయ్యే ప్రాంతంలో అధునాతన బస్ టెర్మినల్‌కు స్థలం కేటాయిస్తామని, దానికి తగిన విధంగా ప్లాన్స్ రెడీ చేయాలని సీఎం ఆదేశించారు.