‘ఆర్ఆర్ఆర్’ తరవాత ఎన్టీఆర్ కెరీర్ మరో స్థాయికి వెళ్లింది. ఆ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన తర్వాత నటించిన చిత్రం ‘దేవర’. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ భాగస్వామ్యంతో నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ కలిసి నిర్మించారు. ఎన్టీఆర్-నీల్ సినిమాతో పాటు దేవర సీక్వెల్ అయిన ‘దేవర 2’ పైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ దృష్టంతా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కథను పూర్తిగా లాక్ చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని చెబుతున్నారు. కథ, పాత్రలు, లొకేషన్లు వంటి అంశాలను ఖరారు చేసి షూటింగ్కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల చిత్ర నిర్మాత సుధాకర్ మిక్కిలినేని కూడా ఒక ఇంటర్వ్యూలో ‘దేవర 2’ సినిమా ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో మరోసారి ఉత్సాహం పెరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి చూస్తే ‘దేవర 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఇప్పటికే ఏర్పడ్డాయి. మొదటి భాగం మంచి విజయాన్ని సాధించడంతో రెండో భాగం మరింత గ్రాండ్గా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.