పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో భయాలు, అపోహలు సృష్టిస్తూ రాజకీయ లాభం పొందాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించడం దురదృష్టకరమని అన్నారు. రాజకీయాలకంటే.. దేశ ప్రయోజనాలే ముందు అన్న భావన ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుతూ, విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడి భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత 12 ఏళ్లలో భారత్ తన ఇంధన భద్రతను మరింత పటిష్ఠపరుచుకుందన్నారు. ఒకప్పుడు 27 దేశాల నుంచి మాత్రమే ముడి చమురు దిగుమతి చేసుకునే భారత్, నేడు 40 దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటూ సరఫరాను విస్తరించిందన్నారు. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, దేశీయంగా పెరిగిన LPG ఉత్పత్తి వంటి చర్యలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి తన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. మోదీ ప్రభుత్వం 140 కోట్ల భారతీయుల సంక్షేమం, దేశ ఇంధన భద్రత, మరియు అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను కాపాడేందుకు నిరంతరం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.