డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ల సప్లై లో అంతరాయం లేకుండా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుండి రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. హాస్పిటల్స్, స్కూళ్లు, దేవాలయాలకు నిరంతర సరఫరా ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఓఎన్జీసీతోపాటు భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సహా గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్ పీసీఎల్,బీపీసీఎల్, ఐఓసీఎల్ లకు చెందిన 1154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోందని ఉన్నతాధికారులు తెలిపారు. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలి పోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.