మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు జరీ చేసింది. ఇటీవల హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యకలాపాల నుంచి సస్పెన్షన్. క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విశ్వాసం కలిగి ఉంది. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదకద్రవ్యాల లేదా మత్తు పదార్థాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండడాన్ని పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపింది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశం మేరకు, ఈ నోటీసు అందిన తేదీ నుండి 7 రోజులలోపు మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై జవాబు స్పష్టంగా వివరిస్తూ సమగ్రంగా లిఖితపూర్వక వివరణ సమర్పించవలసిందిగా ఈ నోటీసు ద్వారా ఆదేశిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంపై పార్టీ నాయకత్వం సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు రోహిత్ రెడ్డి పార్టీ కార్యక్రమాలు మరియు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండవలసిందిగా ఆదేశించింది.