అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇరాన్ ను దెబ్బకొట్టాలని వెళ్లిన ట్రంప్, ఇప్పుడు తన సొంత ఇమేజ్ను, అమెరికా ఆర్థిక వ్యవస్థను, అంతకుమించి ప్రపంచ దేశాలకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చారు. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో మొదలైన ఈ యుద్ధం 17 రోజులు గడిచినా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని టార్గెట్ గా చేసుకుంటే పైచేయి సాదించినట్లేనని భావించినా కానీ అది ఫలించలేదు. ఇరాన్ వెనక్కి తగ్గుతుందనుకున్నారు అయితే ఆ దేశం మరింత శక్తివంతమైన ఎదురుదాడితో షాకిస్తోంది. ఖర్గ్ ఐలాండ్ లోని చమురు క్షేత్రాలపై దాడులతో ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూసినా, అక్కడ ఎగుమతులు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు ప్రపంచ దేశాల యుద్ధ నౌకల సాయం కోరినా ఏ దేశమూ ముందుకు రాలేదు. ఇవన్నీ చూస్తుంటే ఇరాన్ విషయంలో ట్రంప్ వ్యూహాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఫిబ్రవరి 28 నుండి అమెరికా-ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ విధ్వంసకరంగా కొనసాగుతోంది. తాజాగా వైట్‌హౌస్ ప్రెస్ మీట్ ,ట్రూత్ సోషల్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే టార్గెట్ గా చేస్తోన్న ఈ దాడుల్లో.. ఆ దేశ బాలిస్టిక్ క్షిపణులు, నేవీ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ట్రంప్ ధృవీకరించారు. ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ దీవిపై జరిగిన దాడుల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ కేవలం సైనిక లక్ష్యాలను మాత్రమే నాశనం చేశామని, మానవతా దృక్పథంతో చమురు మౌలిక సదుపాయాలను వదిలేశామని తెలిపారు. ఇరాన్ యుద్ధ యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా కుప్పకూలిందని ట్రంప్ ప్రకటించారు. అయితే మిడిల్ ఈస్ట్ లో ఈ ఉద్రిక్త పరిస్థితుల వలన అమెరికాకే కాకుండా, యావత్ ప్రపంచానికి ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా భారత్ పై దీని ప్రభావం తీవ్రంగా పడింది. అంతెందుకు మన ఏపీ, తెలంగాణల్లో బుకింగ్ లు అవ్వక ఇళ్లలో పొయ్యి వెలగడం లేదు, గిట్టుబాటు కాక హోటళ్లు మూతపడుతున్నాయి. నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతుంటే, రవాణా, వ్యవసాయం , పరిశ్రమలు కుదేలయ్యాయి. ట్రంప్ తీసుకున్న ఈ యుద్ధ నిర్ణయం వల్ల నేడు సామాన్య కుటుంబాలపై ఆ ప్రభావం పడుతోంది. ఇండియాలో స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారు లబోదిబోమంటున్నారు. విమాన ప్రయాణాలు చెయ్యాలంటే.. ఛార్జీల మోత మోగుతోంది. అన్నీ ఇబ్బందులే అసలు ఇరాన్ యుద్ధమే జరగకపోయి ఉంటే.. ఈ పరిస్థితులు వచ్చేవే కావు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ట్రంప్ నిర్ణయాల ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. అస్థిరత, అనిశ్చితిని నెలకొంటుంది. జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఇంత చేసి అమెరికా ఏమైనా లాభపడుతోందా అంటే.. అదీ లేదు. ఆ దేశానికి అప్పుల భారం పెరుగుతోంది. పోనీ ట్రంప్ వ్యక్తిగతంగా లాభపడుతున్నారా అంటే.. అదీ లేదు. అమెరికా ప్రజల్లో ట్రంప్ పట్ల ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. సర్వేల్లో ఆయన గ్రాఫ్ 50 శాతం కంటే కిందకు పడిపోయింది. హార్ముజ్ జలసంధి రక్షణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం బెడిసికొడుతోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో భద్రత కోసం తమ యుద్ధ నౌకలను పంపాలని చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే, ఆస్ట్రేలియాతో సహా ఏడు దేశాలను ట్రంప్ కోరారు. చమురు కోసం మీరు ఇరాన్ పైనే ఆధారపడుతున్నారు కదా.. మాకు సహాయం చేయండని ఆయన బహిరంగంగానే కోరారు. అయితే, అమెరికా విజ్ఞప్తికి మిత్రదేశాల నుంచి ఆశించిన రెస్పాన్స్ లేదు. మొదటి నుంచి ఈ విషయంలో ఇతర దేశాలు అమెరికాతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తుండటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు రష్యా దగ్గర చమురు కొంటే ఉక్రెయిన్ పై దాడులకు నిధులు ఇచ్చినట్లేనని భారత్ ను విమర్శించిన డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు అదే భారత్‌ను రష్యా దగ్గర చమురు కొనమని సూచిస్తున్నారు. ఇక ట్రంప్ వ్యూహాలు ఫలించకపోగా, ఈ యుద్ధాన్ని సాగదీసి అమెరికాను ఆర్థికంగా దెబ్బతీయాలని ఇరాన్ ప్రణాళికలు వేస్తోంది. ఐక్యరాజ్యసమితి కేవలం నామమాత్రంగానే మిగిలిపోయింది. గల్ఫ్ చమురుపై ప్రపంచం ఆధారపడి ఉన్న పరిస్థితులలో ఈ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరం.ఈ యుద్ధంలో విజయం సాధించేది ఎవరో కానీ దీని వలన ప్రపంచవ్యాప్తంగా బాధితులు మాత్రం పెరుగుతున్నారు. ఇక ట్రంప్ కూడా ఈ యుద్ధంపై వెనక్కి తగ్గలేక, ముందుకు వెళ్లలేక సతమతమవుతున్నారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని విధంగా దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఉద్రిక్తతలు సమసిపోయి శాంతి వైపు అడుగులు పడతాయా? లేక ప్రపంచాన్ని మరింత సంక్షోభంలోకి నెడతారా? అనేది చూడాల్సి ఉంది.