దివ్యాంగ శక్తి పథకాన్ని నేడు మంగళగిరిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. ఈ ప్రయాణంలో జరిగిన ఒక సంఘటనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం నేను మంగళగిరి నుండి పెనుమాక వరకు పల్లె వెలుగు బస్సులో ప్రయాణించాను – ఒక మంత్రిగా కాదు, సామాన్యుల మాటలను వినాలనుకునే ఒక వ్యక్తిగా. అక్కడ ఉన్న దివ్యాంగ సోదర సోదరీమణులతో కలిసి కూర్చున్నాను. వారిలో కొందరు పనికి వెళ్తుంటే, మరికొందరు మార్కెట్‌కు, ఇంకొందరు వారి దైనందిన పనుల నిమిత్తం వెళ్తున్నారు. అయితే, ఒక యువకునితో జరిగిన సంభాషణ నా మనసులో బలంగా నాటుకుపోయింది. JNTUలో స్పెషల్ ఎడ్యుకేటర్ కోర్సు చదువుతున్న ఆ యువకుడు నాతో అన్న మాటలను నేను అంత సులభంగా మర్చిపోలేను. అమర్త్య సేన్ గారి “డబుల్ హ్యాండీక్యాప్” (Double Handicap) సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ.. సామాన్య ప్రజలతో పోలిస్తే, దివ్యాంగులు అదే స్థాయి జీవితాన్ని గడపడానికి ఆర్థికంగా ఎక్కువ భారాన్ని మోయాల్సి వస్తుందని అతను చెప్పాడు.
“ఈ ‘దివ్యాంగ శక్తి’ పాలసీ కేవలం ఆ భారాన్ని మాత్రమే తగ్గించడం లేదు, మాకు కూడా ఈ రాష్ట్రానికి, దేశానికి మా వంతు సహకారాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. అదే ఈ పథకానికి అసలైన అర్థాన్ని ఇస్తుంది,” అని అతను అన్నాడు. ప్రతిరోజూ తన సొంత సవాళ్లను ఎదుర్కొంటూనే, తోటి దివ్యాంగులకు సేవ చేసేందుకు శిక్షణ పొందుతూ, దేశ నిర్మాణం గురించి ఆలోచిస్తున్న ఆ యువకుని దృక్పథం తనని వినమ్రుడిని చేసిందన్నారు. ‘దివ్యాంగ శక్తి’ అంటే అది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు. ఒక వ్యక్తి ఉదయం తన ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు, గమ్యస్థానానికి ఎలా చేరుకోవాలో అని రెండోసారి ఆలోచించాల్సిన అవసరం లేని పరిస్థితిని కల్పించడం. ఒక సాధారణ ప్రయాణంలో కూడా ఆత్మగౌరవాన్ని అందించడం. ఆ JNTU యువకుడు గుర్తు చేసినట్లుగా, ప్రజలకు సరైన అవకాశం కల్పిస్తే వారు తిరిగి దేశానికి ఎంత గొప్పగా వెలకట్టలేని సేవను అందించగలరో చెప్పడానికి ఇదొక నిదర్శనమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నిజమైన సమ్మిళిత భారతదేశం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని మోడీ, , అలాగే ఆ ఆశయాన్ని గ్రామాల్లో, పట్టణాల్లో మరియు నేను ఈరోజు ప్రయాణించిన మార్గాల్లో క్షేత్రస్థాయిలో నిజం చేస్తున్నచంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.