తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని సీఎం ఆవిష్కరించారు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థించారు. ఈ నెల 22న రైతు భరోసా అందించబోతున్నామని తెలియజేస్తూ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతు సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నారు. రాష్ట్రంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ. 20,616 కోట్ల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను ఆత్మగౌరవంతో బతకడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు రూ. 12 వేల చొప్పున రైతు భరోసా అందిస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద అందించిందన్నారు. పండించిన పంటలపై రైతుల్లో విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, రుణమాఫీ చేయడం, రైతుభరోసా అందించడంతో పాటు రైతు బీమా అమలు చేయడం వంటివన్నీ రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలని వివరించారు.