ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఉగాది పచ్చడి స్వీకరించి, పంచాంగ శ్రవణం ఆలకించారు. రాష్ట్రానికి అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేలా నిర్వహించిన కార్యక్రమంలో అందరికీ స్వయంగా ఉగాది పురస్కారాలు అందించారు. ఆయా రంగాల్లో ప్రముఖులను గౌరవించారు. ఇక జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానమని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగిందన్నారు. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుందన్నారు. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తామన్నారు. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరారు.