విజయవాడలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించిన ‘శ్రీ పరాభవ నామ సంవత్సర’ ఉగాది మహోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని ప్రసంగించారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాదితో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ ఎస్ ఎస్) వ్యవస్థాపకులు డా. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జయంతి కూడా కావడం విశేషమని ఈ వేడుకల్లో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. ఆర్ ఎస్ ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్. అత్యంత క్లిష్ట సందర్భాల్లో కూడా సంఘ్ సేవకులు సామాజిక సేవ చేశారు, చేస్తున్నారని కొనియాడారు. వందేళ్ల సంఘ్ ప్రస్థానం… డా. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారి దార్శనికతకు, నిస్వార్థ కృషికి నిదర్శనమన్నారు. ధర్మ పరిరక్షణ కోసం డాక్టర్ జీ చేసిన కృషి స్ఫూర్తిదాయకమని వారు నాటిన దేశభక్తి వృక్షం నేడు దేశానికి రక్షణగా నిలుస్తోందన్నారు. ఆయన బోధించినట్లు మన భాష, సంస్కృతులను ప్రేమిద్దామని పిలుపునిచ్చారు. పరాయి వ్యామోహంలో పడకుండా, మన మూలాలను కాపాడుకుంటూ ‘వికసిత భారత్’ నిర్మాణంలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు. వ్యక్తి పూజ కంటే దేశానికే ప్రథమ ప్రాధాన్యత ఇద్దామన్నారు.