ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో థియేటర్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇక పవన్ తదుపరి చేయబోయే సినిమాల గురించి వివిధ వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో పవన్ సొంత నిర్మాణసంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఒక కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి, పవన్ కళ్యాణ్ ఎటువంటి కొత్త సినిమా ప్రాజెక్టులకు అంగీకారం తెలపలేదని ప్రస్తుతం కొనసాగుతున్న సినిమాల గురించి వస్తున్న ఊహాగానాలు వాస్తవం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుత తరుణంలో, కొత్త సినిమాలను ప్రారంభించే ఉద్దేశం ఏదీ లేదని అటువంటివి ఏవైనా ఉంటే, అవి సిద్ధంగా ఉన్నప్పుడు అధికారిక మార్గాల ద్వారా తెలియజేయబడతాయని తెలిపింది. ఇక అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న #OG2 కి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ అయినా, ఆయనే స్వయంగా సరైన సమయంలో తెలియజేస్తారని పేర్కొంది.