ఈరోజు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో, NHAI ప్రాయోజిత ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్ అయిన రాజ్ మార్గ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (InvIT) IPO లిస్టింగ్ వేడుకలో కేంద్ర రోడ్డు,రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ మౌలిక సదుపాయాల ప్రస్థానంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. రాజ్ మార్గ్ InvIT అనేది కేవలం ఒక ఆర్థిక ఉత్పత్తి మాత్రమే కాదని జాతీయ రహదారుల వినియోగదారులను వాటి యాజమాన్యంలో భాగస్వాములుగా మార్చే దిశగా వేసిన ఒక విప్లవాత్మక అడుగు అని పేర్కొన్నారు. దీంతో సామాన్య పౌరులు ఇప్పుడు భారత జాతీయ రహదారుల వృద్ధి మరియు అభివృద్ధిలో యాక్టివ్ గా పాల్గొనవచ్చన్నారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రాబోయే సంవత్సరాలలో రాజ్ మార్గ్ InvIT ద్వారా కిలోమీటర్ల రహదారుల మానిటైజేషన్ చేయడమే మా తదుపరి లక్ష్యం. భారతదేశంలోని మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజల పెట్టుబడులు కీలక పాత్ర పోషించాలనే గొప్ప ఆశయంతో ఈ ప్రయత్నం సాగుతోందన్నారు. ఇది దేశ అభివృద్ధి పథంలో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని పెంపొందించడం గురించని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ‘ఆత్మనిర్భర్ భారత్’ విజన్ ను సాకారం చేయడంలో ఇటువంటి సామూహిక భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు.