మోహన్ లాల్-ప్రియదర్శన్ కొత్త సినిమా ప్రత్యేకత అదే..!

Spread the love

మొదటి సినిమా చేసిన హీరోతోనే 100వ సినిమా డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది. అది ఎంతో ప్రత్యేకం కదా…అలాంటి కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలుంటాయి. ఇప్పుడదే జరుగుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా డైరెక్టర్ ప్రియదర్శన్ చేస్తున్న సినిమా ప్రత్యేకత అదే. 1984లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘పూచాక్కోరుమూక్కుత్తి’ తో ప్రియదర్శన్ దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు 100వ సినిమా కూడా మోహన్ లాల్ తోనే ఆయన చేస్తుండడం విశేషం.   ప్రియదర్శన్ తో చేస్తున్న ఈ సినిమా గురించి మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.  కొన్ని మైలురాళ్లు ఒక్క వ్యక్తికి మాత్రమే సొంతం కావు. ఆ ప్రయాణాన్ని అత్యంత దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరికీ అవి సొంతమవుతాయి. నా ప్రియమైన ప్రియన్ తన 100వ చిత్రంలోకి అడుగుపెడుతున్నారు. ఇది ఎంతో ఆనందకరమని అన్నారు. వంద సినిమాలు అంటే అది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. అది అభిరుచితో చెప్పబడిన జీవితకాల కథల సమాహారమని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌ పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తుండగా, బిను జార్జ్ అలెగ్జాండర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రయాణంలో భాగమైనందుకు ఎంతో గర్వపడుతున్నానని మోహన్ లాల్ అన్నారు. ఈ సందర్భంగా ప్రియదర్శన్ ను ఉద్దేశిస్తూ నా స్నేహితుడికి… నువ్వు సృష్టించిన ప్రతిదానికి, ఈ ప్రపంచానికి నువ్వు అందించిన కళకు, మరియు ఇంకా చెప్పబోయే అద్భుతమైన కథలకు  మోహన్ లాల్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *