ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడిందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ నెల 28వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదని, ఈ లోటును భర్తీ చేసేందుకే, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉత్తర్వుల మేరకు వెలగపూడిలోని అసెంబ్లీ హాల్లో ఈ ఆరో సెషన్ జరగనుందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.