ప్రపంచవ్యాప్త పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో, ఇంధనం, సప్లై చైన్ మరియు నిత్యావసర వస్తువుల స్థితిగతులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో, మన పౌరులకు ఇంధనం, విద్యుత్తు మరియు ఇతర కీలకమైన వస్తువుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల మధ్య కూడా భారతదేశం నిరంతరం తన పటుత్వాన్ని చాటుకుంటూనే ఉందన్నారు. ఇకపై కూడా సమయానుకూలంగా, చురుగ్గా మరియు సమన్వయంతో వ్యవహరిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
అలాగే గతకొద్ది రోజులుగా లాక్ డౌన్ విధిస్తారని వస్తున్న వదంతులపై స్పందించారు. భారతదేశంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు పూర్తిగా అబద్ధం. ప్రస్తుతం భారత ప్రభుత్వం వద్ద అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని నేను స్పష్టం చేస్తున్నాను.ఇలాంటి సమయంలో మనం ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా మరియు ఐక్యంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో పుకార్లను వ్యాప్తి చేయడం మరియు ప్రజల్లో భయాందోళనలు కలిగించడం బాధ్యతారాహిత్యం మరియు హానికరమని పేర్కొన్నారు.