బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్టైలిష్ మేకింగ్‌కు పేరుగాంచిన దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు బాలీవుడ్, టాలీవుడ్ కలిసి ఎన్నో పాన్-ఇండియా సినిమాలు తీసినా, ఈ కాంబినేషన్ మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ముగ్గురూ తమ తమ రంగాల్లో మంచి విజయాలు సాధించినవారు. అందుకే ఈ సినిమా ప్రకటనతోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దర్శకుడు వంశీ పైడిపల్లికి బాలీవుడ్లో మొదటి సినిమా. టాలీవుడ్లో ఇప్పటికే ఆయన పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కించారు. ముఖ్యంగా ఆయన తీసిన చిత్రాల్లో స్టోరీతో పాటు ఎమోషన్స్ మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించబోతున్నారు. టాలీవుడ్లో అత్యంత విజయవంతమైన నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన నిర్మించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు ఆయన ఒక బాలీవుడ్ స్టార్‌తో కలిసి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రూపొందించబోతుండటంతో ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేదానిపై క్లారిటీ వచ్చేసింది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో కండలవీరుడి పక్కన కనిపించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈనెల నుండి ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం Matrubhoomi: May War Rest in Peace. దేశభక్తి నేపథ్యంతో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాకు అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా చిత్రాంగద సింగ్ నటిస్తున్నారు.