రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టగా..ఆ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-నా రాజధాని అమరావతి అని ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావడం చాలా సంతోషంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భమని అన్నారు. కేంద్రప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి విజయం.. ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయమని ఇది రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితమని పేర్కొన్నారు. కోట్లాది ప్రజల కోరికను గౌరవించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా చరిత్ర-సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని నిలిపిందన్నారు.
జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకనూ తాకలేడు..!
అమరావతి చట్టబద్దత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చను లోకేష్ టీవీలో వీక్షించారు. అమరావతి చరిత్ర-సంస్కృతి, ఆవశ్యకత సభ్యులు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, దేశంలోని వివిధ పార్టీలు మద్దతుగా నిలవడం ఐదుకోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టింది. లోక్ సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి పరిచయమైందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటులో చరిత్ర సృష్టించిన అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం వారి ద్రోహబుద్ధికి నిదర్శనమని విమర్శించారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకనూ తాకలేడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినీ ఆపలేడు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం అంటూ లోకేష్ పేర్కొన్నారు.