టీ 20 విశ్వవిజేత భారత్ ఈ ఏడాది జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మేరకు జింబాబ్వే క్రికెట్ (ZC) బోర్డు నేడు అధికారిక ప్రకటన విడుదల చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జులై 23, 25, 26 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం అన్ని మ్యాచ్‌లు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక ఇటీవల ముగిసిన 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్-జింబాబ్వే జట్లు తలపడ్డ విషయం తెలిసిందే. చెన్నైలో జరిగిన సూపర్-8 దశ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఆ ప్రపంచకప్ లో జింబాబ్వే టీమ్ అసమాన ప్రతిభ చూపింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై జింబాబ్వే గెలిచి సత్తా చాటిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2024 జూలైలో జింబాబ్వేలో పర్యటించింది. ఈ పర్యటనలో భారత్ మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు ఆడింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత యువ జట్టు ఈ సిరీస్‌ను 4-1 తో కైవసం చేసుకుంది.