అసోంలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయం:ప్రధాని మోడీ

Spread the love

ప్రధాని నరేంద్రమోడీ త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఒకటైన అసోంలో పర్యటించారు. ఆ రాష్ట్రంలోని దిబ్రుగఢ్ జిల్లాలోని ఒక తేయాకు తోటను సందర్శించారు. అక్కడి మహిళా కార్మికులతో కలిసి టీ  ఆకులను కోశారు. వారితో సంభాషించారు. సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను ప్రధాని  తన అఫీషియల్  ‘ఎక్స్’అకౌంట్ లో షేర్ చేశారు. ప్రధాని  రాక నేపథ్యంలో గిరిజన కార్మికులు సంప్రదాయ నృత్యంతో ఆయనకు స్వాగతం పలికారు. ఇక అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అస్సాంలో కాంగ్రెస్ విదేశీయులను స్థిరపరచాలని, తద్వారా ఇక్కడి భూమి పుత్రులను (స్థానికులను) అల్పసంఖ్యాక వర్గంగా మార్చాలని చూస్తోందని విమర్శించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ (BJP-NDA) ప్రభుత్వం రైతులు, ఆదివాసీలు మరియు మన అడవి భూములను చొరబాటుదారుల ఆక్రమణలో ఉండనివ్వదని స్పష్టం చేశారు. అక్రమ ఆక్రమణలకు వ్యతిరేకంగా బిజెపి-ఎన్‌డిఏ ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆదివాసీల హక్కులను కాపాడుతామని భరోసానిచ్చారు. అస్సామీల గౌరవం మరియు అస్తిత్వం కలకాలం నిలిచి ఉంటాయని ఇది మోడీ  గ్యారెంటీ అని తెలిపారు. అసోంలో బీజేపీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. అసోం మాజీ సీఎం శర్బానంద సోనోవాల్, ప్రస్తుత సీఎం  హిమంత బిశ్వశర్మ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథాన దూసుకుపోతోందన్నారు. అసోంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *