భారతీయ ఇతిహాసం రామాయణం ఎన్నిసార్లు చూసినా ప్రత్యేకంగా కనిపించే ఈ ఇతిహాసంపై ఇప్పటికే దేశంలోని ఎన్నో భాషల్లో సినిమాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ రాముడిగా తెరకెక్కుతున్న సినిమా రామాయణ. ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ను విడుదల చేశారు. అత్యద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకునే విధంగా ఈ టీజర్ వీడియో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా ఉంది. రాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్ లుక్ ను ఈ వీడియోలో రివీల్ చేశారు. రాముడు తన జీవితాంతం తీసుకున్న నిర్ణయాలు ఎల్లప్పుడూ లోక కల్యాణం కోసం, కోరిక కంటే కర్తవ్యానికి, స్వార్థం కంటే త్యాగానికి ప్రాధాన్యతనిస్తూ సాగాయి. అందుకే ఆయన అన్ని కాలాల్లోనూ అత్యంత గొప్ప వ్యక్తిగా నిలిచారని ఆయన వారసత్వం మానవాళిని నిరంతరం శక్తివంతం చేస్తూనే ఉంది. మానవతా దృక్పథంలోని మంచితనం ద్వారా అన్ని విభేదాలను పరిష్కరించి, ప్రపంచానికి శాంతిని చేకూర్చగలమనే నమ్మకాన్ని ఇది కలిగిస్తుందని మూవీ టీమ్ పేర్కొంది. ఇక ఇటీవలే ఈ గ్లిమ్ప్స్ ను లాస్ ఏంజిల్స్ లోని ఐమాక్స్ లో స్పెషల్ గా ప్రదర్శించారు. ఇక ఇందులో రాముడి పాత్రలో చేస్తున్న రణ్ బీర్ కపూర్ శ్రీరాముడిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. శ్రీరాముడు కేవలం ఒక పురాణపాత్ర మాత్రమే కాదని శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది ప్రజల అంతరాత్మ, ఆరాధ్యదైవమని పేర్కొన్నారు. కష్టసమయాలలో మనిషి స్ఫూర్తి ఎలా ఉండాలో మనకు నేర్పరన్నారు. అటువంటి పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమాను దాదాపుగా రూ.4000 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ భారీ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఇతిహాసాన్ని ప్రపంచమంతా చూసేలా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. ప్రపంచమంతా ఈ ప్రాజెక్ట్ తో భారత్ వైపు చూస్తుందన్నారు. ఇందులో సీతాదేవి పాత్రలో సాయి పల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యష్ కనిపించనున్నారు. 2026 దీపావళికి ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది.