ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీసమేతంగా ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. సీతారాములు వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. వేలాది భక్తులతో కలిసి కనులవిందుగా జరిగిన కళ్యాణోత్సవాన్ని తిలకించారు. రాష్ట్రం, ప్రజలందరిపై ఆ సీతారాముల వారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు కల్పించిన సదుపాయాలు, దర్శన ఏర్పాట్లు బాగున్నాయని పేర్కొన్నారు. ఒంటిమిట్ట క్షేత్రాన్ని ఆధ్యాత్మిక వైభవంతో పాటు టెంపుల్ టూరిజం కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు శక్తి, సామర్థ్యాలను ప్రసాదించాలని ప్రార్థించారు.