రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాలను క్రమం తప్పకుండా సేకరించి, వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తూ పర్యావరణ పరిరక్షణ సాధించాలనే లక్ష్యంతో, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి , పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలో భాగంగా ప్రారంభమైన స్వచ్ఛ రథాలు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రోజు 537 పాఠశాలల పరిధిలో, విద్యార్థులు ఘన, ద్రవ వ్యర్థాలను వేరు చేసి ఘన మరియు ద్రవ వనరుల నిర్వహణ (SLRM) కు అనుగుణంగా అందించగా, ఈ కార్యక్రమంలో మొత్తం 576 స్వచ్ఛ రథాలు పాల్గొన్నాయని తెలిపింది. చెత్త నుండి సంపద సృష్టి కార్యక్రమంలో భాగంగా, ఒక్క రోజులోనే దాదాపు 1 లక్ష కేజీల చెత్తను స్వచ్ఛ సారథులు సేకరించినట్లు పేర్కొంది. సేకరించిన వ్యర్థాల ద్వారా సుమారు రూ.11.96 లక్షల ఆదాయం లభించనుందని తెలిపారు. ఆ తర్వాత చెత్తను అందించిన విద్యార్థులకు పంచాయతీరాజ్ అధికారులు మరియు స్వచ్ఛ సారథులు కొత్త పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా అభినందించారు.