అస్సాంలో ఉండే లోకల్ ముస్లింలకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అస్సాంలో అక్రమ చొరబాట్లను ప్రోత్సహించిందని విమర్శించారు. తాము స్థానిక ముస్లింలకు వ్యతిరేకం కాదని చొరబాటుదారులను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అస్సాం ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటించారు. అస్సాం గణ పరిషత్ కు చెందిన కేశబ్ మహంతా తరపున కాలియాబోర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. బీజేపీ, అస్సాం గణ పరిషత్ పొత్తును సూర్యచంద్రులతో పోల్చారు. కాంగ్రెస్ పైన విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాజీరంగా నేషనల్ పార్క్ ను చొరబాటుదారులకు అప్పగించారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఎన్డీయే సర్కార్ అక్రమ చొరబాటుదారులను అక్కడ నుండి ఖాళీ చేయించిందని అన్నారు. దీనిని సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్డీయే (NDA) పాలన అసోం చరిత్రలో ఒక స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించిందన్నారు. ఇది రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడమే కాకుండా, శ్రేయస్సుతో కూడిన కొత్త శకానికి నాంది పలికిందన్నారు. నేడు అసోం ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు మూడవసారి భారీ విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇక 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఈ నెల 9న ఎన్నికల పోలింగ్ జరగనుంది.