దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు తనకు అలాగే ధోనీ కెప్టెన్ గా వచ్చిన తరువాత తన కుమారుడు యువరాజ్ సింగ్ కు అన్యాయం జరిగిందని మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత్ కు వరల్డ్ కప్ లను అందించిన కెప్టెన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సరికాదని కామెంట్స్ కూడా చేశారు. ఇక తాజాగా ఆయన కుమారుడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన తండ్రి చేసిన ఆ వ్యాఖ్యలపై ఒక పాడ్ క్యాస్ట్ లో స్పందించారు. ఆ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కపిల్ దేవ్, ధోనీలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా మా తండ్రి ఇచ్చిన ఇంటర్వ్యూలను చూశాను. అలాంటి వ్యాఖ్యలను విన్నాను. అది సరికాదని ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. అందుకే ఆయన తరపున నేను వారిద్దరికీ క్షమాపణలు చెబుతున్నానని యువరాజ్ అన్నారు. యువరాజ్ తన ఆల్ రౌండ్ ప్రతిభతో భారత్ కు ఎన్నో విజయాలను అందించారు. 2011 ప్రపంచకప్ లో కీలక ఆటతీరుతో భారత్ ప్రపంచ విజేతగా నిలవడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు.