మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించి, రికార్డు స్థాయిలో 1,26,057 హెక్టార్లను మైక్రో అగ్రికల్చర్ పరిధిలోకి తీసుకువచ్చిన అధికారులను, సిబ్బందిని సీఎం ఈ సందర్భంగా అభినందించారు. ఏపీ తర్వాత 1.05 లక్షల హెక్టార్ల మైక్రో ఇరిగేషన్ సాగుతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న 1,08,143 మంది రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక సాగు పద్ధతుల ద్వారా వారికి నాణ్యమైన దిగుబడి, అధిక లాభాలు రావాలని సీఎం ఆకాంక్షించారు. మైక్రో ఇరిగేషన్ అనేది తక్కువ నీటితో కూడా మంచి దిగుబడిని సాధించే ఒక మోడ్రన్ ఇరిగేషన్ పద్ధతి. ఈ విధానంలో నీటిని నేరుగా మొక్కల వేర్ల వద్దకు పైపుల ద్వారా పంపిస్తారు. దీనివల్ల వాటర్ వేస్టేజ్ గణనీయంగా తగ్గుతుంది. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఈ పద్ధతి ద్వారా సుమారు 40% నుండి 60% వరకు నీరు ఆదా అవుతుంది. అలాగే ఎరువులను కూడా నీటితో కలిపి నేరుగా మొక్కలకు అందించవచ్చు. ఇది భూసారాన్ని పరిరక్షించడమే కాకుండా, కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఇక అలాగే కూలీల ఖర్చును తగ్గిస్తుంది. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో రైతులకు ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు కీలకంగా ఉపయోగించుకోవచ్చు.