కర్ణాటకలో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఆయనకు ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. సింధనూరులో తెలుగు ప్రజలు భారీగా తరలివచ్చారు. స్థానికంగా వివిధ పార్టీల నాయకులు, తెలుగు సంఘాలు, అభిమానులు, తెలుగు యువత, స్థానిక తెలుగు ప్రజానీకం లోకేష్ కు ఘనస్వాగతం పలికారు . భారీ సందోహానికి అభివాదం చేస్తూ లోకేష్ ముందుకు సాగారు. ఈ పర్యటనలో ఎంజీ సర్కిల్ నుంచి హోసళ్లీ క్యాంపు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌లలు కూడా లోకేష్ తో కలిసి పలు అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోసళ్లీ క్యాంపులో కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకకు లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో కలిసి ఆయన సైనిక్ స్కూల్ ను ప్రారంభించారు. స్కూల్ ప్రాంగణంలో బసవేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ హాస్టల్ బిల్డింగ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులలో ఒకరైన దివంగత డాక్టర్ దండమూడి రాధాకృష్ణ జ్ఞాపకార్థం నిర్మించిన ‘డా. రాధాకృష్ణ కళాధామ’ ఓపెన్ ఆడిటోరియంను వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు. ఇక అదే విధంగా సింధనూరు గంగావతి రోడ్డులోని తెలుగు సంఘం కళ్యాణ మండపంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రులతో కలిసి లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అప్పుడు చంద్రబాబు అక్రమ అరెస్టు పరిస్థితుల్లో సింధనూరు, రాయచూర్ లోని తెలుగు ప్రజలు అండగా నిలిచారన్నారు. మీ రుణం తీర్చుకునేందుకే ఇక్కడికి వచ్చాను. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా టీడీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.