అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

Spread the love

అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పనులను  సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ప్రధానితో ప్రారంభోత్సవం చేస్తామన్నారు.  ఈ మేరకు పనులు సత్వరం పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని  చెప్పారు. దాని ప్రకారం అధికారులు కూడా పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో రూ.57,821 కోట్ల విలవైన పనులు ఉండగా… వాటిల్లో రూ. 50, 943 కోట్ల పనులు గ్రౌండ్ అయినట్లు  అధికారులు సీఎంకు వివరించారు. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల పురోగతిని సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనుల్లో మొత్తంగా 20 వేల మంది కార్మికులు, నిపుణులు పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. నిర్దేశించుకున్న పనులు  ఎంత మేరకు జరుగుతున్నాయనే  విషయంలో పనుల వారీగా సీఎం చర్చించారు. వారం, నెల వారీగా టార్గెట్‌లు పెట్టుకుని రాజధాని పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వచ్చే వర్షా కాలంలో పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉందని ఈలోపు చేపట్టాల్సిన పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎక్కువ ప్రాజెక్టులను చేపడుతున్న నిర్మాణ సంస్థలు మరింతగా దృష్టిని కేంద్రీకరించి పనులు చేయాలన్నారు. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ పనిగా  చూడొద్దని ఇప్పుడు పనులు చేస్తున్న  వారంతా చరిత్రలో భాగస్వాములువుతున్నట్టేనని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థలుగా  రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదని  రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయన్నారు. అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపాలని తెలిపారు. నిర్మాణాలలో క్వాలిటీ ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి నిర్మాణం పూర్తి చేసి తీరాల్సిందేనని పునరుద్ఘాటించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *