2026 మార్చి నెలకు గానూ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును భారత స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కైవసం చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో సంజూ శాంసన్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ లు ఇంకా భారత క్రికెట్ అభిమానుల మనసుల్లోనే ఉన్నాయి. గత నెలలో తనదైన ఆటతీరుతో విమర్శలకు చెక్ పెడుతూ సంజూ చేసిన అద్భుత ప్రదర్శనకు గానూ ఐసీసీ ఈ పురస్కారంతో సత్కరించింది. మార్చి నెలలో జరిగిన టీ20 వరల్డ్ కప్ కీలక మ్యాచ్‌లలో శాంసన్ సత్తా చాటాడు. వెస్టిండీస్‌పై 97 (నాటౌట్), సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 89, మరియు ఫైనల్లో న్యూజిలాండ్‌పై 89 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. 80.25 యావరేజ్ తో 3 హాఫ్ సెంచరీలతో 321 పరుగులు చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.