నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు ఒకే రోజు రెండు వేర్వేరు కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అందులో ఒకటి ఆస్తి కోసం సొంత అన్ననే కడతేర్చిన తమ్ముడి వ్యవహారం కాగా, ఎవరికీ అనుమానం రాకుండా పొలంలో గంజాయి సాగు చేసిన ఓ వృద్ధుడి గుట్టు పోలీసులు రట్టు చేశారు. ఆర్.కృష్ణాపురం గ్రామంలో ఉమ్మడి ఆస్తిగా ఉన్న 8 ఎకరాల భూమి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ దారుణ హత్యకు కారణమైంది. ఈ నెల 11వ తేదీ రాత్రి, తమ్ముడు గుర్రం విజయరాజు, తన అన్న దేవా భక్తుడి తలపై కర్రతో బలంగా కొట్టాడు. హాస్పిటల్ కు తరలిస్తుండగా దేవా భక్తుడు మృతి చెందాడు. మృతుని భార్య జ్యోతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పక్కా సమాచారంతో ఈరోజు ఉదయం 9:45 గంటలకు NH-40 నుండి పెద్దకందుకూరు వెళ్లే మార్గంలో ఉన్న కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద ప్రధాన నిందితుడు గుర్రం విజయరాజును, అతనికి సహకరించిన అతని భార్య గుర్రం సుధారాణిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇక మరోవైపు ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లె గ్రామం, తెలుగుపేటకు చెందిన 65 ఏళ్ల కొండబోయిన నరసింహుడు అనే రైతు వ్యవహారం పోలీసులనే అవాక్కయ్యేలా చేసింది. బ్రహ్మంగారి మఠం వద్ద ఓ సాధువు నుంచి గంజాయి విత్తనాలు తెచ్చిన నరసింహుడు ఎవరికీ అనుమానం రాకుండా మిట్టపల్లె చెరువు దాటిన తర్వాత ఉన్న తన పొలం గట్టు మీద వాటిని పెంచాడు. వారం క్రితం ఆ మొక్కలను కోసి, ఇంట్లోనే ఆరబెడుతుండగా పోలీసులకు దొరికాడు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు తనిఖీలు చేసిన రూరల్ పోలీసులు నరసింహుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి ఏకంగా 3 కిలోల 250 గ్రాముల గంజాయిని, 400 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.