కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చూస్తున్న నియోజకవర్గాల_పునర్విభజన (Delimitation) సవరణ బిల్లు, తమిళనాడు మరియు దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న “అపారమైన చారిత్రక అన్యాయం” అని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ మరోసారి తన గళాన్ని వినిపించారు. ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నందుకు తమిళనాడు మరియు ఇతర దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష విధిస్తున్నారా? అని ప్రశ్నించారు. వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న ప్రతి భారతీయుడు ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. బీజేపీ నిప్పుతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనకు నిరసనగా రేపు తమిళనాడు అంతటా ఇళ్లపైన మరియు బహిరంగ ప్రదేశాలలో నల్ల జెండాలు ఎగురవేస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు గొంతును వినడానికి నిరాకరించి, వెనక్కి తగ్గకపోతే.. మీరు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. డీఎంకే (DMK) అధ్యక్షుడిగా మరియు అన్నింటికీ మించి ఆత్మగౌరవం ఉన్న ఒక తమిళుడిగా నేను మరోసారి హెచ్చరిస్తున్నాను. దీనిపై తమిళనాడు పోరాడుతుందని పోరాడి తమిళనాడు గెలుస్తుందని పేర్కొన్నారు.