మొదలైన సెన్సస్ ప్రక్రియ..వివరాలు నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు

Spread the love

జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మొత్తం ఈ జనగణన కార్యక్రమాన్ని  విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగమవ్వాలన్నారు. రాష్ట్రంలో ఈరోజు నుండి ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు  తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ ద్వారా  వివరాల రిజిస్టర్  ప్రక్రియ నేడు మొదలైంది. se.census.gov.in వెబ్ సైట్ లో సీఎం వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ సీఎంకు  వివరించారు. ఈ నెల 30 తేదీ వరకూ ప్రజలు స్వయంగా ఆన్ లైన్ లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలు రిజిస్టర్ చేసుకునేందుకు  అవకాశం కల్పించామని సీఎంకు తెలిపారు. మే 1 తేదీ నుండి  30 తేదీ వరకూ ఎన్యుమరేటర్ అధికారులు ఇంటింటికీ వెళ్లి భౌతికంగా హౌస్ లిస్టింగ్  ప్రక్రియను చేపడతారని తెలియచేశారు. రాష్ట్రంలో పౌరులందరికీ సమానంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను  అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇందుకోసం కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికల్ని తీసుకురావడం  అవసరమని ఈ లక్ష్య సాధనలో సెన్సస్ కార్యక్రమం అత్యంత కీలకమని పేర్కొన్నారు.  రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీలో జనగణన కార్యక్రమం జరుగుతోందని ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాకుండా అభివృద్ధికి పటిష్టమైన పునాది వేస్తుందన్నారు. జనాభా లెక్కల కార్యక్రమం రెండు దశల్లో జరుగనుందని మొదటి దశలో ఇవాల్టి నుంచే హౌస్ గణన ప్రారంభమైందన్నారు. వచ్చే ఏడాది నుండి  ప్రారంభమయ్యే రెండో దశలో జనాభా లెక్కల సేకరణ ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం ప్రారంభమైన హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *