మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ కీలక బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. దేశ రాజకీయాల దశ, దిశను ఇది మారుస్తుందని పేర్కొన్నారు. దేశ జనాభాలో సగభాగమైన మహిళలు నిర్ణయాధికార ప్రక్రియలో భాగం కావడం వలన దేశానికి కొత్త దిశానిర్దేశం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్… రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026, డీలిమిటేషన్ బిల్లు, 2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026లను సభ ముందుకు తెచ్చారు. ఇక ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో విపక్షాలు మూజువాణి ఓటింగ్‌ను అంగీకరించలేదు. ఓట్ల విభజన (డివిజన్)కు పట్టుబట్టడంతో సభలో ఓటింగ్ నిర్వహించారు. బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 185 ఓట్లు పోలైనట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఆటోమేటిక్ ఓట్ రికార్డర్ సిస్టమ్ ద్వారా ఈ ప్రాసెస్ ను పూర్తిచేశారు. ఆ తర్వాత ఓటు స్లిప్పుల ద్వారా జరిగిన ఓటింగ్‌లో మొత్తం 333 మంది సభ్యులు పాల్గొన్నారు. పార్టీలు ఈ బిల్లును పొలిటికల్ యాంగిల్ లో చూడవద్దని ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ సభకు విజ్ఞప్తి చేశారు. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో మహిళా రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు ముందు చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఎలాంటి వివక్షకు, అన్యాయానికి ఆస్కారం ఉండదని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాలనే భేదం లేకుండా ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.