మహిళా బిల్లును, డీ లిమిటేషన్ కి  లింక్ పెట్టడం జగన్ గారి అవివేకానికి నిదర్శనం:వై.ఎస్.షర్మిల 

Spread the love

తన సోదరుడు, మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ పై ఏపీసీసీ ఛీఫ్ షర్మిల మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దత్తపుత్రుడు జగన్  గారి తెర తొలగింది. బీజేపీతో పెట్టుకున్న అక్రమపొత్తు తేటతెల్లమైందని ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ, జనసేనల కంటే మోడీ  గారిని ఇంతలా మోయాలా? మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా ? అక్రమ డీ లిమిటేషన్ బిల్లులపై ఎన్డీఏ పక్షాన నిలబడ్డందుకు వైసీపీ అధినేత  జగన్ గారు సిగ్గుపడాలి. మీ 5 ఏళ్ల పాలనలో చేసిన అవినీతి కోసం ఇంతలా బీజేపీతో అంటకాగాలా? అని ప్రశ్నించారు.  కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా? బీజేపీ బిల్లులకు గొర్రెలా గుడ్డిగా తలాడించాలా ? మోదీ గారి మెప్పుకోసం సొంత కాకిలెక్కలు అల్లాలా? అంటూ ‘ఎక్స్’ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. 

ఇదేనా మీరు చెప్పే వై.ఎస్.ఆర్ ఆశయాలు, వారసత్వం ? మహానేత సిద్ధాంతాలను మంట గలిపినందుకు, విలువలకు తూట్లు పొడిచినందుకు జగన్ గారే ఆత్మవిమర్శ చేసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లును విపక్షాలు అడ్డుపడి విజయం సాధిస్తే, ఏం సాధించారని ప్రశ్నించడం తీవ్ర  హాస్యాస్పదమని అన్నారు. ఓటేసి ఇంతకు మీరేం సాధించారు? కోట్లాది AP రాష్ట్ర ప్రజల గుండెలు గాయపరచడమా మీరు సాధించిన గొప్పతనమని ఎద్దేవా చేశారు. దక్షిణాది రాష్ట్రాల బావోగ్వేదాన్ని అర్థం చేసుకోకపోవడమా మీ రాజకీయం ? ప్రతిపక్షంగా విపక్షానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి అధికార పక్షానికి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ? అని ప్రశ్నించారు.  మహిళా బిల్లును, డీ లిమిటేషన్ కి  లింక్ పెట్టడం జగన్ గారి అవివేకానికి నిదర్శనమన్నారు. మహిళల 33 శాతం రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకం కాదని అవనికి అగ్రతాంబూలం అందిస్తుంటే అభ్యంతరం ఎవరికి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా దేశ వ్యాప్తంగా విపక్షాల ఐక్యత ఒకటే. మహిళా బిల్లు పాస్ అయ్యింది 2023 లోనేనని అడ్డుకున్నది మోదీజీ లబ్ది కోసం పెట్టిన డీ లిమిటేషన్ బిల్లును మాత్రమేనని స్పష్టం చేశారు.  నియోజకవర్గాల పునర్విభజనపై, మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ స్టాండ్ క్రిస్టల్ క్లియర్ అని అన్నారు. 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాలి. కులగణన ద్వారా SC, ST, OBC ల సంఖ్య తేలాలి. కులాల ఆధారంగా డీ లిమిటేషన్ లో రిజర్వేషన్లు పాటించాలని పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బాబు- జగన్ –  పవన్. మూడు పార్టీలు మోడీ గారి మెప్పుకోరే పార్టీలే. ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని షర్మిల పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *