మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు రేపే తెచ్చినా మ‌ద్ద‌తు:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

కాంగ్రెస్ పార్టీకి దేశం మొద‌టి ప్రాధాన్య‌త  అని,  ఆ త‌ర్వాత ప్ర‌జ‌లు, చివ‌ర‌గా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం .రేవంత్ రెడ్డి ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. దేశ భవిష్య‌త్‌ ను, స‌మ‌గ్ర‌త‌ను బ‌ల‌హీన‌ప‌ర్చేలా దేశ రాజ‌కీయ చిత్ర‌ప‌టాన్నే మార్చే బిల్లును కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవల  తీసుకువ‌స్తే  దానిని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఓడించాయ‌ని తెలిపారు. ప్ర‌తిప‌క్షాలు అడ్డుకున్న‌ది ప్ర‌మాద‌క‌ర‌మైన నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌నేనన్నారు. బిల్లుల విష‌యంలో బీజేపీ, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి నిజాయితీ లేద‌ని అన్నారు. మ‌హిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపినట్లు పేర్కొన్నారు.  త‌మ‌కు గంట స‌మ‌యం ఇస్తే బిల్లును మార్చివేస్తామ‌ని అమిత్ షా అన్నార‌ని… సోమ‌వారం వ‌ర‌కు స‌మ‌యం ఉంద‌ని, ప్ర‌స్తుతం ఉన్న 543 సీట్ల‌తోనే బీజేపీ మ‌హిళా బిల్లు తీసుకువ‌స్తే మంగ‌ళ‌వార‌మే పాస్ చేస్తామ‌ని పేర్కొన్నారు. 

ప్ర‌స్తుతం లోక్ సభలో ఉన్న 543 సీట్ల‌లో 1/3 వంతు సీట్లు, రాష్ట్రాల శాస‌న‌స‌భ‌ల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా మహిళా రిజర్వేషన్లపై సోమవారం వరకు కొత్త చట్టాలను రూపొందించి పార్లమెంట్ ముందుకు తేవాలని చెప్పారు. అలాచేస్తే  ఇండియా కూటమితో కలిపి 2023లో లాగా ఆ బిల్లుకు తాము మద్దతు ఇస్తామ‌ని, సోమవారం బిల్ పాస్ చేసి ఆ తర్వాత మంగళవారం నుండే  ఈ చట్టాన్ని అమలు చేయ‌వ‌చ్చ‌ని సీఎం తెలిపారు. 

బీజేపీ తెచ్చిన డీలిమిటేష‌న్ సౌత్  రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల‌ను రాజ‌కీయంగా  దెబ్బ‌తీసే డీలిమిటేష‌న్ అని, దేశాన్ని ప్ర‌జాస్వామ్యాన్ని  బ‌ల‌హీన‌ప‌ర్చే డీలిమిటేష‌న్ అని విమ‌ర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వం విధానాలతో ద‌క్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్ర‌ణ పాటించాయ‌ని ఫ‌లితంగా ఆయా రాష్ట్రాల్లో జ‌నాభా తగ్గిందన్నారు. దేశానికి విధేయంగా వ్య‌వ‌హ‌రించిన ద‌క్షిణాది రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాల్సింది పోయి శిక్షించడం సరైంది కాదని పేర్కొన్నారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌, నియోజ‌క‌వ‌ర్గాల పెంపు బిల్లుల ముసుగులో రాజ్యాంగం మార్పు, రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుకు బీజేపీ మ‌రోసారి చేసిన ప్ర‌య‌త్నాన్ని కాంగ్రెస్, ఇత‌ర విప‌క్షాలు క‌లిసి ఓడించాయ‌ని అన్నారు. ఈ బిల్లులు వీగిపోవ‌డానికి కార‌ణ‌మైన నేత‌లంద‌రికీ కృత‌జ్ఞ‌తలు తెలుపుతున్న‌ట్లు సీఎం తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై అఖిల‌ప‌క్ష స‌మావేశాలు, చ‌ర్చ‌లు జ‌ర‌పాలని సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *