భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్ ‘రామాయణ’. మన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ఈ ఇతిహాసాన్ని ఇప్పుడు కొత్త తరం ప్రేక్షకులకు, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్‌కు అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ ఈ భారీ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. కేవలం భారతీయ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అయి ఆస్వాదించేలా ఒక గ్లోబల్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. అమెరికాలోని CinemaCon వేదికపై ఈ సినిమాకు సంబంధించిన కొన్నిసీక్వెన్స్ ని హాలీవుడ్ ఎగ్జిబిటర్లకు చూపించారు. అక్కడి నుండి వచ్చిన స్పందన చాలా గొప్పగా ఉందని చెబుతున్నారు. ఇది నిజంగా భారతీయ సినిమాకు గర్వకారణమని చెప్పుకోవాలి. మనదైన కథను ప్రపంచ స్థాయి టెక్నాలజీతో అత్యద్భుతంగా తెరకెక్కించనుండడం ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలబెడుతోంది.ఈ చిత్రంలో రావణుడి పాత్రను పోషిస్తున్నది కన్నడ స్టార్ యష్. ఆయనతో పాటు నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమా మేకింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వారి మాటల్లో చెప్పాలంటే… ఈ సినిమా హాలీవుడ్‌లో వచ్చిన కొన్ని భారీ మూవీస్ తరహాలో ఉండబోతోందట. అంటే విజువల్స్, స్కేల్, కథ చెప్పే విధానం అన్ని కలిపి ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయి. ఈ సినిమాకు మరో ప్రధాన బలం విజువల్ ఎఫెక్ట్స్. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ సంస్థ DNEG ఈ ప్రాజెక్ట్‌కు వీఎఫ్ఎక్స్ అందిస్తోంది. ఫోటోరియలిస్టిక్ విజువల్స్ కోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ… రామాయణం వంటి గొప్ప ఇతిహాసాన్ని నేటి ప్రపంచ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం తమ బాధ్యత అని అన్నారు. ఇక శ్రీరాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్, సీతాదేవి పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు.