ఆంధ్రప్రదేశ్ లో ఇంధన కొరత అంశానికి సంబంధించి ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. పెట్రోల్ లేదు.. డిజిల్ లేదు.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదని మండిపడ్డారు. ప్రజలకు కనీసం ఫ్యుయల్ కొరత లేకుండా చూడలేనోళ్లు రాష్ట్రాన్ని ఉద్దరిస్తారట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ఎక్కడా లేని ఇంధనం కొరత ఏపీలోనే ఏర్పడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇంధన కష్టం కూటమి ప్రభుత్వం విధించిన శాపమని దుయ్యబట్టారు. సరిపడా ఇంధనం అందక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఎర్రటి ఎండలో జనాలను కిలోమీటర్ల మేర నిలబెట్టడం.. పెట్రోల్, డీజిల్ లేదని నో స్టాక్ బోర్డులు తగిలించడం కూటమి పాలనా వైఫల్యానికి నిదర్శనమని ఎండగట్టారు. 70 శాతం బంకులు బంద్ పెట్టడం అత్యంత దారుణమని మోడీ గారికి మద్దతు ఇచ్చి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టడం బాధాకరమని ఆక్షేపించారు. సమీక్షలు, సలహాలతో ప్రజల ఇంధన కష్టాలు తీరవని రాష్ట్రంలో ఇంధన సంక్షోభంపై కూటమి ప్రభుత్వం వెంటనే నిద్రమత్తు వీడాలన్నారు. ఇంధనం కొరత ప్రభావం ప్రజా జీవనంపై పడకుండా చూడాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అప్రమత్తం అవ్వాలని ఇంధనం కొరతకు లోపం ఎక్కడుందో గుర్తించి డిమాండ్ కి తగ్గ సప్లై ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. 24 గంటల డెడ్ లైన్ లా ప్రభుత్వం పని చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అత్యవసర పరిస్థితిగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.