ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంగా మారిన ఆ ప్రాంతం దగ్గర లోనే తన అద్భుతమైన ప్రకృతి వింతలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ అంతర్జాతీయంగా వార్తల్లో నిలుస్తోంది ఒక ప్రాంతం. ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ హీట్ ను పక్కన పెడితే, అక్కడ ప్రకృతి సిద్ధంగా వెలసిన రంగుల ప్రపంచం పర్యాటక ప్రేమికులను, శాస్త్రవేత్తలను అబ్బురపడేలా చేస్తోంది. ఒకవైపు దేశాల మధ్య ఆధిపత్య పోరు, మరోవైపు నయనానందకరమైన ప్రకృతి సౌందర్యంతో ప్రపంచాన్ని ఆ ప్రాంతం తనవైపు తిప్పుకుంది . అదేంటో ఓ లుక్ వేద్దాం.
పర్షియన్- ఒమన్ సింధుల మధ్య చమురు రవాణాకు కీలకంగా ఉన్న జలసంధిగా హర్మూజ్ మనకు తెలిసిందే. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలతో ఒక్కసారిగా గత కొన్ని నెలల నుండి ప్రతి ఒక్కరికి సుపరిచితమైంది హర్ముజ్ జలసంధి. ముఖ్యంగా పర్షియా నుండి మహా సముద్రాల్లోకి దారితీసే ఏకైక సముద్ర మార్గం ఇది. అందుకే ప్రపంచంలోని కీలక సముద్ర మార్గాల్లో ఒకటిగా, వ్యూహాత్మక ప్రదేశంగా నిలుస్తోంది. ఇక ఆ మార్గంలోనే ఉన్న హర్మూజ్ ద్వీపమే ఆ అద్భుతమైన ప్రాంతం. ఈ ద్వీపం విస్తీర్ణం 42 చదరపు కి.మీ.
ఈ ప్రాంతంలోని కొండలు మరియు లోయలు భూమిపై మరెక్కడా లేని విధంగా వివిధ రంగులను కప్పుకుని అద్భుతంగా కనువిందు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఖనిజాల కలయికతో ఏర్పడిన ఈ ప్రకృతి సహజ రంగులతో తీర్చిదిద్దినట్లు అలరిస్తాయి. సహజంగా ఏర్పడిన ఈ వైవిధ్యమైన అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ ప్రదేశం ఇంత వైవిధ్యంగా కనిపించడానికి కారణం ఇక్కడి మట్టిలో ఉన్న ఐరన్ ఆక్సైడ్, ఇతర ఎలిమెంట్సేనని చెబుతుంటారు. సూర్యుడి కాంతి ఈ ప్రదేశం పాడినప్పుడు వివిధ రంగులతో తణుకులీనుతూ మెరిసిపోతుంటుంది. ఈ దీవిలో 70కి పైగా ఖనిజాలు ఉన్నాయనీ వాటివల్లే అక్కడి రాళ్లూ మట్టి అద్భుత రంగులతో కనువిందు చేస్తున్నాయనేది జియాలజిస్టుల చెబుతున్నారు. అందుకే ఈ దీవి రెయిన్ బో ఐలాండ్ గా ప్రసిద్ధి చెందింది.
సముద్రపు అలలు ఈ ఇసుకను తాకినప్పుడు నీరు కూడా ఎరుపు రంగులోకి మారి చూడటానికి అద్భుతంగా కనువిందు చేస్తుంది. ఎటువైపు చూసిన చుట్టూ నీరు మధ్యలో రంగులతో భూతల స్వర్గంగా వెలిగిపోతుంటుంది. ఎరుపు రంగుతో మెరిసే బీచ్ పై సూర్య కిరణాలు పడినప్పుడు అదే తీరంలో కనిపించే ఆ ఎర్రటి కాంతి ఈ బీచ్ ను ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించని సరికొత్త అందాన్ని చూపిస్తుంది. అక్కడ దొరికే మట్టి రంగుల్లోనే టూరిస్ట్ ల కోసం రెస్టారెంట్లనీ, కెఫెల్నీ ఏర్పాటు చేయడం కూడా ఈ దీవిలో ప్రత్యేకత.
భూమిపై ఎక్కడా లేని విధంగా ఈ దీవి ఎన్నో ప్రత్యేకతలకు కేంద్రంగా ఈ దీవి విలసిల్లుతోంది. ఉప్పు గుహలతో వైవిధ్యమైన ఆకారాల రాతి కట్టడాలతో ఆకట్టుకుంటోంది. ఇక ఇక్కడ ఇంకొక విశేషమేమిటంటే ఇక్కడి మట్టిని కూడా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే తినదగిన మట్టి దొరికే ఏకైక ప్రదేశం కూడా ఇదేనని ప్రతీతి. స్థానిక ప్రజలు ఇక్కడి ఎరుపు మట్టిని ‘గోలాక్’ అంటారు. వంటల్లో మసాలాగా, చట్నీల తయారీలో మరియు వివిధ కూరల్లో రంగు కోసం ఉపయోగిస్తారు. అన్ని రకాల వంటల్లో ఈ మట్టిని ఉపయోగించుకుంటారంటే అతిశయోక్తి కాదు. అంత ప్రత్యేకత కలిగిన ఈ మట్టితో చేసిన కళాకృతులు కళా ప్రేమికులను అలరిస్తున్నాయి. ఆ కళాఖండాలు స్థానిక మ్యూజియంలో ప్రదర్శిస్తుంటారు. Museum of Nadalian స్థానిక సంస్కృతి మరియు పర్యావరణ కళను ప్రతిబింబించే మ్యూజియం ఇది.
ఇలా ఈ ప్రాంతానికి చాలా ప్రత్యే కతలు ఇక్కడున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ప్రాంతం ‘పర్యాటకులతో సందడిగా ఉంటుంది. వేల సంవత్సరాలుగా జనావాసంతో ఉన్న ఈ ఐలాండ్ ను ప్రసిద్ధ యాత్రికులు సందర్శించేవారని చెబుతుంటారు.భారత్ నుండి కూడా గోవా, గుజరాత్ ల నుండి ఇరాన్ లోని ఖేష్ దీవికి ప్రయాణించే ఓడలకు హాల్టింగ్ స్పాట్ గా ఈ ఐలాండ్ ను ఉపయోగించేవా రని తెలుస్తోంది. అందుకే ఈ ద్వీపంలో పోర్చుగీసు కోటకు సంబంధించిన ఆనవాళ్లు ఆనాటి చరిత్రకు సాక్షిభూతంగా కనిపిస్తుంటాయి.
హర్ముజ్ ద్వీపంలోని జీవవైవిధ్యం కూడా భౌగోళిక ప్రత్యేకతలతో ముడిపడి ఉంది. ఇక్కడ మట్టిలో ఉప్పు మరియు ఖనిజాలు అధికంగా ఉన్నప్పటికీ, తీర ప్రాంతాల్లో అద్భుతమైన మడ అడవులు విస్తరించడం అవి వేల జంతువులకు ఆవాసాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ‘హరా’ అని పిలిచే మడ అడవులు సముద్రపు నీటిలో పెరుగుతూ అనేక రకాల సముద్ర జీవులకు ఆవాసంగా ఉన్నాయి.శీతాకాలంలో సైబీరియా వంటి ప్రాంతాల నుండి వలస వచ్చే నీటి పక్షులకు ఈ ద్వీపం ఆశ్రయమిస్తుంది.
సముద్ర జీవుల విషయానికి వస్తే, హర్ముజ్ తీరం సముద్ర తాబేళ్లకు ప్రసిద్ధి. ముఖ్యంగా అంతరించిపోతున్న ‘హాక్స్బిల్’ తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు ఇక్కడి ఇసుక తిన్నెలకు వస్తుంటాయి. సముద్ర గర్భంలో రంగురంగుల పగడపు దిబ్బలతో వివిధ రకాల సముద్ర చరాలకు చేపలకు నిలయంగా ఉన్నాయి. నేల పైన చెట్లు తక్కువగా ఉన్నా ఎడారి వాతావరణానికి తట్టుకునే చిన్నపాటి పొదలు మరియు అరుదైన బల్లులు, కీటకాలు ఇక్కడి పర్యావరణ వ్యవస్థలో భాగమై జీవిస్తున్నాయి. ఈ ద్వీపంలోని విలక్షణమైన పరిస్థితుల మధ్య జీవనం కొనసాగించడం ఇక్కడి జీవవైవిధ్యం యొక్క ప్రత్యేకత.
ఇలా ఎన్నో విలక్షణ విశేషాలతో ప్రస్తుతం వార్తల్లో నిలిచిన ఈ దీవికి ముందు ముందు పర్యాటకంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకోనుంది. ఇక ముందు కూడా ప్రపంచ పర్యాటక ప్రేమికులు ఈ దీవిని సందర్శించేందుకు ఆసక్తికనబరిచే అవకాశముంది. ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు లేదా నౌకలపై దాడులు జరిగినప్పుడు, అంతర్జాతీయ విమానయాన సంస్థలు మరియు పర్యాటకులు భద్రతను దృష్టిలో ఉంచుకుని పర్యటనలను వాయిదా వేసుకుంటున్నారు. ఇక పరిస్థితులు చక్కబడి అక్కడ శాంతి పునరుద్దరించబడితే తిరిగి పర్యాటకం పుంజుకుని తద్వారా విదేశీ పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగే అవకాశం ఉంది.