రైతన్న ఆవేదన వింటుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ?:వై.ఎస్.షర్మిల  

Spread the love

కూటమి పాపం.. ఆక్వా రైతన్న పాలిట శాపంగా మారిందని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం రొయ్య రైతులకు అంతులేని కష్టం కలిగించిందని విమర్శించారు. కంటికి రెప్పలా చూసుకొనే రొయ్య పిల్లలను బ్రతికించేందుకు ఓ బంకు దగ్గర రైతన్న పడిన ఆవేదన వర్ణనాతీతం అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.  రూ. 500 డీజిల్ కోసం ఆ రైతు  రోదించిన తీరు చూసి కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. రైతన్న ఆవేదన వింటుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ? ఇది  రైతన్నను రక్షించే ప్రభుత్వమా ? భక్షించే ప్రభుత్వమా ? ఇదేనా చంద్రబాబు  గారి విజినరీ ? దీన్నే అంటారా అద్భుతమైన గుడ్ గవర్నెన్స్ ? అని ప్రశ్నలు గుప్పించారు. రైతులతో కాళ్లు పట్టించుకున్న పాపం ఈ కూటమి ప్రభుత్వానికి తగలకపోదని అన్నారు. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఏపీలోనే ఎందుకొచ్చింది ? అని నిలదీశారు. ఎన్డీయే పాలిత రాష్ట్రంలో ఫ్యూయల్ కోసం ప్రజల పడిగాపులు, రేషన్ విధానంలో పెట్రోల్, డీజిల్ పోయడమా ? సరిపడేంత ఇంధనం ఉంటే దాదాపు 3 వేల బంకుల్లో స్టాక్ లేదని  బోర్డులు ఇవ్వాళ్టికి ఎందుకున్నాయన్నారు. ఇదేనా రాష్ట్ర ప్రజలపై కేంద్రానికున్న చిత్తశుద్ధి ? ఇందుకేనా పడి పడి మోదీజీకి మద్దతు ఇచ్చేది ? బంకుల దగ్గర జనాలు అవస్థలు పడుతుంటే, ప్రత్యక్షంగా అన్నీ రంగాలపై ఇంధన సంక్షోభం తీవ్ర పరిణామాలు చూపిస్తుంటే, ఇంకా బీజేపీ భజన చేయడానికి, మోదీగారి తొత్తుగా ఉండటానికి చంద్రబాబు సిగ్గుపడాలని ఘాటుగా విమర్శించారు.  రాష్ట్రంపై బీజేపీకి పట్టింపు లేదనడానికి ఇంధన సంక్షోభం ఒక  నిదర్శనమని అన్నారు.  వదంతులు నమ్మొద్దని చెప్పే బదులు .. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *