ఏపీలో ఇంధన కొరత అంశంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్.జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం వెన్నతో పెట్టిన విద్యని ఆరోపణలు చేశారు. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ మీరు లాభపడడం అలవాటుగా మారిందన్నారు. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగిందన్న జగన్ తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్ చేరిందని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు. సరఫరాలో సంక్షోభం లేదని కానీ, ఇక్కడ డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే, ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్నారని వారితో కూటమి నాయకులు జత కట్టారని అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయన్నారు. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోందని చెప్పారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్ అందక కార్యకలాపాలు నిల్చిపోతున్నాయని రబీ పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైందన్నారు. కోత యంత్రాలకు సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. చేపలు మరియు రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరిఏటర్లు కూడా డీజిల్‌పై ఆధారపడటంతో, ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.