విశాఖపట్నంలో ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అనంతరం గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్ ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే ప్రసంగించారు. గూగుల్ ఇండియా ఏఐ హబ్ కు నేడు చేసిన శంకుస్థాపన 2047 వికసిత్ భారత్కు ఓ పునాది రాయి లాంటిదన్నారు. ఏఐ యుగంలో ఏర్పాటు చేస్తున ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భారత డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్లోనూ ఈ డేటా సెంటర్ అత్యంత ముఖ్యమైన అంశమని గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా ఇప్పుడు విశాఖ, ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుందన్నారు. ఇంటర్నేషనల్ సబ్ సీ గేట్ వే గా ఉన్న ముంబై , చెన్నైలతో పాటు విశాఖ కూడా ఇప్పుడు కీలకంగా మారిందని పేర్కొన్నారు. కొత్త ఫైబర్ ఆప్టిక్ లైన్లు ఇతర ప్రాంతాలతో విశాఖను కనెక్ట్ చేస్తాయని వివరించారు. అండర్ సీ లైన్లతో సంప్రదాయ నౌకాయాన మార్గాలు ఇక డిజిటల్ ట్రేడ్ రూట్లుగా మారతాయన్నారు. అదానీ కనెక్ట్స్, ఎయిర్ టెల్ నెక్స్ట్రా ఈ డేటా సెంటర్ ఏర్పాటులో భాగస్వామ్యం వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్ గా ఎదుగుతున్న ఈ ప్రాంతానికి భవిష్యత్ సాంకేతికేతను అందించేలా ఈ డేటా సెంటర్ ఉంటుందన్నారు.
స్థానిక యువతకు ఉద్యోగ భద్రత, ఇంధన భద్రత, నీటి వినియోగం లాంటి అంశాలతో స్థానిక భాగస్వామ్యంతో ముందుకు అడుగులు వేస్తామన్నారు. యువతకు భవితను అందించేలా వారికి అడ్వాన్స్ డ్ క్లౌడ్, ఏఐలో శిక్షణ కార్యక్రమాలు కూడా గూగుల్ నిర్వహిస్తుందన్నారు. 10 వేల మందికి పైగా మహిళలకు మైక్రో ఎంట్రప్రైజ్ గా మారేందుకు కూడా సహకారం అందిస్తుందని తెలిపారు. న్యూ ట్రాన్స్ మిషన్ లైన్లు, ఎనర్జీ స్టోరేజి సిస్టమ్స్ లాంటివి ఈ ప్రాంతానికి ఫ్యూయల్ సెక్యూరిటీని కల్పిస్తాయన్నారు. విశాఖలోని వివిధ నివాస ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు ఈ ప్రాంతానికి ఆర్ధిక స్థిరత్వం కల్పించేలా ఈ డేటా సెంటర్ ఏర్పాటవుతున్నట్లు తెలిపారు.