గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన నేడు విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. గూగుల్ తో భారత్ లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చిందన్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటులో అదానీ కనెక్స్ , ఎయిర్ టెల్ నెక్స్ ట్రా సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు, యువతకు ప్రత్యేకించి నమస్కారాలు తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఓ చరిత్రను సృష్టిస్తోందన్నారు. ఉక్కు నగరంగా పేరు పొందిన విశాఖ ఇక డేటా సిటీ అవుతుందని ఏఐ డేటా సెంటర్‌తో గ్లోబల్ ఐటీ మ్యాప్ లోకి విశాఖ గూగుల్ వచ్చి చేరిందన్నారు. 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. దానిని పునరుద్ధరిస్తూ ప్రజలు కూటమి ప్రజాప్రభుత్వానికి సపోర్ట్ చేశారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచస్థాయి కంపెనీలు ఆంధ్ర ప్రదేశ్ కు వస్తున్నాయన్నారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ లాంటి ప్రాజెక్టులు వేగంగా పెట్టుబడులు వస్తున్నాయనటానికి ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్, ఏపీలో డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్లతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాకారం అవుతోందన్నారు. ప్రధాని మోదీ సహకారంతో దేశంలోనే 25 శాతం మేర పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని తెలిపారు. ప్రపంచం గతంలో చూడని నవ భారతం ఈ టెక్ ప్రాజెక్టుతో సాకారం అవుతోందన్నారు. అప్పట్లో సైబరాబాద్ నిర్మాణం చూశాం. ఇప్పుడు విశాఖలోని ఏఐ డేటా సెంటర్ తో కొత్త ఘట్టం ఆవిష్కృతం అయ్యిందన్నారు. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతోందన్నారు. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, మెకానికల్ సహా వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఈ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.