ఈ సంవత్సరం సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్’ గారు సినిమాతో భారీ హిట్ ను అందుకున్నారు సీనియర్ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయన తదుపరి చేస్తోన్న సినిమా నుండి ఒక కీలక అప్డేట్ వచ్చేసింది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కోసం లుక్ టెస్ట్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్, డైరెక్టర్ బాబీ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేసింది. “మరో సంబరానికి తెరలేచింది. మెగాస్టార్ చిరంజీవి మెగా158 కోసం లుక్ టెస్ట్ పూర్తి చేశారు. ముహూర్తం, షూటింగ్ అప్డేట్స్ త్వరలో తెలపనున్నట్లు వెల్లడించింది. దర్శకుడు బాబీ కూడా స్పందిస్తూ.. “లుక్ టెస్ట్ పూర్తయింది. మెగాస్టార్ చిరంజీవి గారి లుక్ ను నేడు లాక్ చేశామని తెలిపారు. అలాగే ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గతంలో మెగాస్టార్ తో ఆయన తెరకెక్కించిన ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. లుక్ టెస్ట్ పూర్తి కావడంతో త్వరలోనే షూటింగ్ కోసం రంగంలోకి దిగనుంది. గతేడాది మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.