దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. సుమారు 22 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్టపడి రాసిన పరీక్ష, లీక్ వీరుల ధనదాహానికి బలైపోయింది. దర్యాప్తు సంస్థల విచారణలో రాజస్థాన్ నుంచి హర్యానా, ఢిల్లీ, బీహార్ మీదుగా కేరళ వరకు ఈ నెట్వర్క్ విస్తరించి ఉన్నట్లు తేలింది. నాసిక్ నుండి మొదలైన ఈ లీక్ చైన్, జైపూర్, సికార్‌లను దాటుకుని జమ్మూ కాశ్మీర్ వరకు చేరింది. ఎంతో పకడ్బందీగా ఉండాల్సిన పరీక్షా వ్యవస్థను ఈ అంతరాష్ట్ర మాఫియా అస్తవ్యస్తం చేసింది.రాజస్థాన్ లోని సికార్ ఇప్పుడు ఈ లీక్ కుంభకోణానికి కేంద్ర బిందువుగా మారింది. కోటా తర్వాత కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన సికార్‌లోనే అసలు కుట్ర జరిగినట్లు ఆధారాలు దొరుకుతున్నాయి. అనేక కోచింగ్ సెంటర్లు తాము ఇస్తున్నది కేవలం గెస్ పేపర్ అని నమ్మబలుకుతూ విద్యార్థులకు ప్రశ్నలు నేర్పించాయి. అయితే, పరీక్ష ముగిశాక అసలు విషయం బయటపడింది. ఆ గెస్ పేపర్‌లో ఉన్న 140 ప్రశ్నలు యథాతథంగా నీట్ పరీక్షలో కనిపించడంతో దర్యాప్తు అధికారులు విస్తుపోయారు.లీకైన మెటీరియల్ ను అమ్ముకోవడంలో ఈ మాఫియా భారీ వ్యాపారమే చేసింది. మొదట లక్షల రూపాయలకు బేరం పెట్టి, పరీక్ష దగ్గర పడుతున్న కొద్దీ ఐదు వేల నుంచి 30 వేల రూపాయల వరకు అమ్మేసినట్లు దర్యాప్తులో తేలింది. కేవలం కోచింగ్ సెంటర్లే కాకుండా, కొన్ని హాస్టల్ నెట్వర్క్‌లు కూడా ఈ పాపంలో భాగస్వాములయ్యాయి. సికార్‌కు చెందిన ఒక సెంటర్ నిర్వాహకుడు ఈ పేపర్‌ను కేరళలోని ఒక ఎంబీబీఎస్ విద్యార్థికి 30 వేలకు అమ్మినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ లీక్ ప్రక్రియ కేవలం వాట్సాప్‌కే పరిమితం కాలేదు. టెలిగ్రామ్ వంటి ఇతర మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఈ పేపర్ వేల సార్లు ఫార్వర్డ్ అయ్యింది. ప్రింటింగ్ ప్రెస్ నుంచే ఈ లీక్ మొదలైనట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. రాజస్థాన్ నాగౌర్ కనెక్షన్ కూడా ఇందులో బలంగా కనిపిస్తోంది. ఒక విద్యార్థి ఏకంగా 28 లక్షల రూపాయలు చెల్లించి, పరీక్షకు నాలుగు రోజుల ముందే సికార్ చేరుకుని ప్రశ్నపత్రాన్ని పొందినట్లు సమాచారం అందుతోంది.వ్యవస్థీకృత నేరగాళ్ల నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందంటే.. బయోలజీ నుంచి 90 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నలను ఎంపిక చేసిన కొంతమంది విద్యార్థులకే అందేలా చూశారు. ఇప్పుడు ఈ పరీక్ష రద్దు కావడం విద్యార్థులు మరియు తల్లిదండ్రులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులు ఈ అన్యాయాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ వ్యవస్థలోని లొసుగులను వాడుకుని కోట్లు గడిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.నీట్ స్కామ్ వెనుక ఉన్నది కేవలం ఒక వ్యక్తి లేదా ఒక సెంటర్ కాదు.. ఇది దేశవ్యాప్తంగా పాతుకుపోయిన ఒక మాఫియా. ప్రింటింగ్ ప్రెస్ నుంచి విద్యార్థి చేతికి చేరే వరకు ప్రతి దశలోనూ అవినీతి రాజ్యమేలింది. ఇప్పుడు ఈ పరీక్షను రద్దు చేయడం ఒక పరిష్కారమే కావొచ్చు, కానీ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ వ్యవస్థీకృత నెట్‌వర్క్ మూలాలను ప్రభుత్వం తుడిచిపెట్టాల్సి ఉంది. విద్యా వ్యవస్థకే మచ్చ తెచ్చిన ఈ పేపర్ లీక్ వీరులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు దర్యాప్తు సంస్థలపై ఉంది.